విషాదం..పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ భగాయత్‌లో విషాదం జరిగింది.
By Knakam Karthik
విషాదం..పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ భగాయత్‌లో విషాదం జరిగింది. పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సునీత, వెంకటేష్ దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చారు. ఉప్పల్‌లోని కూర్మనగర్‌లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మణికంఠ, అర్జున్ అనే కుమారులతో పాటు ఓ కూతురు ఉంది. అయితే మంగళవారం మణికంఠ, అర్జున్ అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఆ తప్పిపోయిన చిన్నారులు విగతజీవులుగా ప్రత్యక్షమయ్యారు.
ఫిర్జాదిగూడ భగాయత్‌లో కుల సంఘాల భవనానికి కేటాయించిన భూమిలో భవన నిర్మాణ పనులు జరుగుతున్న పిల్లర్ గుంతలో పడి చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చేపట్టారు. ఒక పిల్లర్ గుంతలో అర్జున్ మృతదేహం లభ్యం కాగా, మరో పిల్లర్ గుంతలో మణికంఠ మృతదేహం లభ్యమైంది. చిన్నారులను విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.