గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం.. సీసీ కెమెరాకు అడ్డంగా బుక్
Try to robbery in govinda raja swamy temple.తిరుపతిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గోవిందరాజస్వామి ఆలయంలో
By తోట వంశీ కుమార్ Published on 27 March 2021 8:26 AM GMTతిరుపతిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఉదయం సుప్రభాత సేవ కోసం తాళాలు తెరువగా.. ఆలయంలోని హుండీతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో చోరి జరిగిందని అనుమానించారు. వెంటనే ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు.
నిన్న ఏకాంత సేవ తరువాత భక్తుడిగా నటిస్తూ ఓ దొంగ గుడి లోనికి ప్రవేశించాడు. హుండీ దగ్గర డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా.. భక్తులు అటువైపు వస్తుండడంతో ఓ చోట నక్కాడు. ఆలయ సిబ్బందికి కనిపించకుండా లోపలే ఉండిపోయాడు. భక్తులు అందరూ వెళ్లిపోయారని బావించిన సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. అర్థరాత్రి ఆ వ్యక్తి మళ్లీ డబ్బులు తీసేందుకు యత్నించాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆలయంలోని రెండు హుండీల్లో చోరీకి యత్నించినట్లు అనుమానిస్తున్నారు. గుడిలో అన్ని చోట్ల తాళాలు వేసి ఉండటంతో దొంగ ప్రయత్నం ఫలించలేదు. ఆ వ్యక్తి రాత్రంతా గుడిలోను ఉన్నట్లు తెలిసింది.
సీసీఎస్ డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయానికి చేరుకున్నారు. విష్ణు నివాసం కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ టీవీ రికార్డు అయిన వీడియోను పరిశీలించారు. నిందితుడు తన వద్ద ఉన్న తాళాలతో ధ్వజస్తంభం హుండీని తెరిచేందుకు ప్రయత్నించినట్లు అందులో రికార్డు అయింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.