ఘోర ప్ర‌మాదం.. ఆగి ఉన్న 2 బ‌స్సుల‌ను ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మ‌ర‌ణం

సిద్ధి జిల్లాలోని రేవా-సాత్నా సరిహద్దుల్లో ఓ లారీ భీభ‌త్సం సృష్టించింది. ఆగి ఉన్న రెండు బ‌స్సుల‌ను ఢీ కొట్టింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2023 8:09 AM IST
ఘోర ప్ర‌మాదం.. ఆగి ఉన్న 2 బ‌స్సుల‌ను ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మ‌ర‌ణం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సిద్ధి జిల్లాలోని రేవా-సాత్నా సరిహద్దుల్లో ఓ లారీ భీభ‌త్సం సృష్టించింది. వేగంగా దూసుకువ‌చ్చిన లారీ అదుపుత‌ప్పింది. ఆగి ఉన్న రెండు బ‌స్సుల‌ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం అర్థ‌రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 6 గురు అక్క‌డిక్క‌డే చ‌నిపోయారు. మ‌రో 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ప్రమాదం ధాటికి ఒక బస్సు రెండు భాగాలుగా విడిపోగా, మరొకటి నుజ్జునుజ్జు అయింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. గాయ‌ప‌డిన వారిలో 15 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

కేంద్ర మంత్రి అమిత్‌షా నిర్వహించిన ర్యాలీ కోసం బస్సుల్లో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియ‌జేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ.2ల‌క్ష‌లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రులంద‌రికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Next Story