వారంతా రెక్కాడితేనే గాని డొక్కాడని కూలీలు. ఉదయం అంతా కష్టపడ్డారు. పని ముగించుకున్న అనంతరం ఆటోలో ఇంటికి బయలుదేరారు. మరికాసేపట్లో ఇళ్లకు చేరుతామనగా మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకువచ్చింది. వారు ప్రయాణీస్తున్న ఆటోను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో జరిగింది.
వారు అంతా మహిళా కూలీలు. పని ముగించుకుని ఆటోలో ఇంటికి పయనమయ్యారు. బీదర్‌లోని బేమలఖేడా ప్రభుత్వ పాఠశాల సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనాస్థలంలోనే ఏడుగురు మహిళలు మరణించారు. రెండు వాహనాల డ్రైవర్లతో సహా మరో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను పార్వతి (40), ప్రభావతి (36), గుండమ్మ (60), యాదమ్మ (40), జగ్గమ్మ (34), ఈశ్వరమ్మ (55), రుక్మిణి బాయి (60)గా గుర్తించారు. కాగా.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.