ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 27 ఏళ్ల గిరిజన మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం నాడు తెలిపారు. బాధితురాలు రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని స్థానిక జాతరను సందర్శించేందుకు వెళుతుండగా పుసౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయమై మంగళవారం మహిళ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఫిర్యాదుదారు ప్రకారం.. కొందరు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు ఒడ్డుకు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 70(1), 351(2) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ ఘటన చాలా తీవ్రమైనదని, నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. “రాయ్‌గఢ్‌లోని పుసౌర్ ప్రాంతంలో జరిగిన అత్యాచార ఘటన చాలా తీవ్రమైనది. నిందితులను వెంటనే అరెస్టు చేసి నిందితులకు శిక్ష పడే వరకు బాధితురాలికి రక్షణ కల్పించాలన్నారు. బాధితురాలికి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించాలి” అని బఘెల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.