ఒడిశాలోని బలంగీర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల గిరిజన మహిళ తనపై దాడి చేసి, కులపరమైన వ్యాఖ్యలు చేసి, బలవంతంగా తన మలం తనకు తినిపించే ప్రయత్నం చేశాడని ఓ వ్యక్తిపై ఆరోపణలు చేసింది. నవంబర్ 16న గ్రామంలోని చెరువులో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అభయ్ బాగ్ తనపై దాడి చేసి కుల దూషణలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. మహిళ బంగోముండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆమె ఫిర్యాదు ప్రకారం.. అభయ్ బాగ్ ఆమె ఛాతీపై కొట్టడంతో ఆమె పడిపోయింది. ఆమె వృద్ధ తల్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆ వ్యక్తి ఆమెను గొంతు కోస్తానని బెదిరించి, మాటలతో దుర్భాషలాడాడు. బాగ్ తన ముఖాన్ని మానవ మలంతో అద్ది, బలవంతంగా తినిపించే ప్రయత్నం చేశాడని మహిళ ఆరోపించింది.
గిరిజనేతరుడైన తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ నడుపుతూ తన పంటను పాడు చేసినందుకు నిందితుడిపై తాను చేసిన నిరసనకు ప్రతీకారంగా ఇది జరిగిందని మహిళ ఆరోపించింది. నిందితుడు పరారీలో ఉన్నాడని కాంతాబంజీ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) గౌరంగ్ చరణ్ సాహు ధృవీకరించారు, అయితే అతనిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానిక గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
గిరిజన సంక్షేమ సంఘం సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణం స్పందించకుంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక సామాజిక కార్యకర్త అజిత్ జోషి దాడిని ఖండించారు, ఇది "నిందనీయమైన చర్య" అని అభివర్ణించారు. జాప్యం లేకుండా నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు. తదుపరి పోలీసు విచారణ కొనసాగుతోంది.