ట్రయాంగిల్ లవ్ స్టోరీ: అమ్మాయి కోసం ఫ్రెండ్‌ని చంపేశాడు
ఒకే అమ్మాయిని ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేమించారు. మరి అమ్మాయి వారిలో ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ.. అందులో ఓ యువకుడు మాత్రం దారుణానికి ఒడిగట్టాడు.
By అంజి Published on 21 July 2023 8:15 AM ISTట్రయాంగిల్ లవ్ స్టోరీ: అమ్మాయి కోసం ఫ్రెండ్‌ని చంపేశాడు
అదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకే అమ్మాయిని ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేమించారు. మరి అమ్మాయి వారిలో ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ.. అందులో ఓ యువకుడు మాత్రం దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని ఆవేశంలో తన ఫ్రెండ్‌ని చంపేశాడు. ఇలాంటి ఘటనలు సినిమాల్లో చూడటం తప్ప.. బయట పెద్దగా జరగడం లేదనుకుంటే పొరపాటే. తాజా ఘటనే అందుకు నిదర్శనం. అదృశ్యమైన యువకుడి కేసు మిస్టరీని పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తూరులో నివాసం ఉంటున్న బీహార్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబానికి చెందిన రాహుల్ సింగ్ సింగ్ అలియాస్ అమర్నాథ్ (21), రెండేళ్ల కిందట అదే రాష్ట్రం నుంచి వచ్చి తిమ్మాపూర్ హెచ్‌ఐఎల్ ఇండస్ట్రీలో పని చేసే రాజ్‌కపిల్ సాహు (20) ఫ్రెండ్స్. వీరిద్దరూ బీహార్‌కు చెందిన ఒకే యువతిని ప్రేమించారు. ఆ యువతి రాజ్‌కపిల్‌తో చనువుగా ఉండటం చూసి రాహుల్ సింగ్ సహించలేకపోయాడు. ఈ క్రమంలోనే రాజ్‌కపిల్ హత్యకు ప్లాన్ చేశారు.
ఈ నెల 18న సాయంత్రం కొత్తూరుకు చెందిన పాత నేరస్థుడు మహమ్మద్ తాహేర్ (19), మరో ఇద్దరు మైనర్లతో కలిసి మద్యం తాగేందుకు తిమ్మాపూర్ సమీపంలోని ఓ పాత వెంచర్ వద్దకు రాజ్‌కపిల్‌ని రాహుల్ సింగ్ తీసుకెళ్లాడు. మద్యం సేవించిన అనంతరం బీరు సీసాలతో పొడిచి, తలపై బండరాయితో కొట్టి చంపారు. అనంతరం అక్కడే మృతదేహంపై కొంత మట్టికప్పి వెళ్లిపోయారు. ఈ నెల 19న హెచ్‌ఐఎల్ ఇండస్ట్రీ కాంట్రాక్టర్ సోనూకుమార్ రాజ్‌కపిల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి గదిలో ఉండే సహచరుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాహుల్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు.