మృత్యవులోనూ ఆ స్నేహితుల బంధం వీడలేదు. ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్‌షిప్ డేని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న ఆ యువకులు కొద్ది సేపటికే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పాల్వంచలోని నవ భారత్ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు నవభారత్ ప్రాంతానికి చెందిన ఏనుగుల ఉపేందర్ రెడ్డి కుమారుడు మధుకర్ రెడ్డి (21) , వరంగల్ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన దూడల శ్రీను కుమారుడు శివ (21) స్పోర్ట్స్ మోటార్‌బైక్‌పై ప్రయాణిస్తుండగా, అతివేగంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్రెండ్‌షిప్ డే పార్టీ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులు పాల్వంచ పట్టణంలోని కేఎల్‌ఆర్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. నిన్న ఫ్రెండ్‌షిప్ డే కావడంతో వీరిద్దరూ సాయంత్రం పట్టణంలో ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి వేడుక చేసుకున్నారు. ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. వేడుక ముగిసిన అనంతరం మధుకర్‌ను బైక్‌పై ఇంటివద్ద దింపేందుకు శివ బయల్దేరాడు. ఎన్‌ఎండీసీ సమీపంలోని మూలమలుపు వద్ద అతివేగం కారణంగా అదుపుతప్పి డీవైడర్‌ను ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన స్నేహితులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదుతో ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్రెండ్‌షిప్ డే రోజే ఇద్దరు మిత్రులు మృత్యువాత పడటంతో కాలేజీ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.