Jagtial : హనుమాన్ జయంతి వేళ ఘోర ప్రమాదం..లారీ బీభత్సానికి ముగ్గురు యువకులు బలి
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది.
By - Knakam Karthik |
హనుమాన్ జయంతి వేళ ఘోర ప్రమాదం..లారీ బీభత్సానికి ముగ్గురు యువకులు బలి
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ధర్మపురిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక లారీ, ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు గాల్లోకి ఎగిరి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అదే సమయంలో లారీ పక్కనే వెళ్తున్న ఆటోను కూడా బలంగా తాకడంతో, ఆ ఆటో అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారవ్వగా, పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు ఏ గ్రామానికి చెందిన వారో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ విషాద ఘటనతో ధర్మపురిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతి వేగం మరియు అజాగ్రత్తగా ఓవర్‌టేక్ చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.