ఏపీలో దారుణం.. ప్రియురాలికి పురుగు మందు కొనిచ్చి..

ప్రేమిస్తున్నానని చెప్పి చనువు పెంచుకున్నాడు. కొన్ని సంవత్సరాలకు మరో యువతితో వివాహానికి రెడీ అయ్యాడు.

By అంజి  Published on  23 Oct 2024 6:56 AM IST
insecticide, girlfriend, APnews, Crime

ఏపీలో దారుణం.. ప్రియురాలికి పురుగు మందు కొనిచ్చి..  

ప్రేమిస్తున్నానని చెప్పి చనువు పెంచుకున్నాడు. కొన్ని సంవత్సరాలకు మరో యువతితో వివాహానికి రెడీ అయ్యాడు. ఇదేంటని నిలదీసిన ప్రియురాలికి పురుగుల మందు కొనిచ్చి.. ఆమె చావుకు కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సర్పవరం పోలీస్‌స్టేషన్‌ సీఐ పెద్ది రాజు తెలిపారు. యు.కొత్తపల్లి ఇసుకపల్లికి చెందిన ములికి ఉమామహేశ్వరరావు కాకినాడ గొడారిగుంటకు చెందిన 24 ఏళ్ల యువతిని 2017 నుండి ప్రేమించడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో దగ్గరగా మెలిగాడు.

అయితే ఇటీవల పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని చెప్పుకొచ్చిన అతడు.. మరో యువతితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ప్రియురాలు ఈ నెల 14వ తేదీన అతన్ని నిలదీసింది. దీంతో అతడు చస్తే చావు.. తన పెళ్లికి అడ్డురాకు అంటూ సూసైడ్‌కు ప్రేరేపించాడు. దీంతో యువతి పురుగుమందు కొనేందుకు షాపుకు వెళ్లగా.. ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించిన ఉమామహేశ్వరరావు ఆన్‌లైన్‌ ద్వారా దుకాణ యజమానికి డబ్బులు చెల్లించి ప్రియురాలికి పురుగుల మందు కొనిచ్చాడు. అది తాగి ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఉమామహేశ్వరరావును అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌ విధించారు.

Next Story