Nalgonda: ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్టు.. ఇద్దరు యువతులు సూసైడ్
నల్గొండ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 6 Sept 2023 10:27 AM ISTNalgonda: ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్టు.. ఇద్దరు యువతులు సూసైడ్
నల్గొండ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. సర్వసాధారణంగా చాలామంది తమ వాట్సాప్ డీపీకి రకరకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువతులు వారి వాట్సాప్ డీపీలో తమ ఫోటోలను పెట్టుకొని ఆనందించారు. కానీ అవి తమ ప్రాణాలను తీసుకుంటాయని వారు ఊహించలేకపోయారు. గతంలో పోలీసులు ఎన్నో మార్లు వాట్సాప్ డీపీలో వ్యక్తిగత ఫోటోలు పెట్టకూడదంటూ సూచించారు. అయితే ఈ ఇద్దరు యువతులు వాట్సాప్ డీపీలో తమ ఫోటోలు పెట్టుకుని పోకిరిల చేతికి చిక్కి బలవన్మరణానికి పాల్పడ్డారు. కొందరు ఆకతాయిలు.. ఆ యువతుల వాట్సాప్ డీపీలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై నల్గొండ శివారులోని రాంనగర్‌లోని మున్సిపల్ పార్కులో మంగళవారం ఇద్దరు యువతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అనంతరం పార్కు గేటు బయట ఉన్న ఓ చెట్టు కిందకు వచ్చి పడిపోయారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న అంబనబోలుకు చెందిన యువతి (20), నక్కలపల్లికి చెందిన మరో యువతి (20) మంగళవారం సాయంత్రం మున్సిపల్ పార్కులో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని స్థానికులు గుర్తించారు. వారి పక్కనే క్రిమిసంహారక మందు బాటిల్ కూడా లభ్యమైంది. అది గమనించిన స్థానికులు యువతులిద్దరిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఆ ఇద్దరు మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు బాలికలు పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ కళాశాలకు వెళ్లేవారు. పోలీసులు ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.