ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య.
By అంజి
ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
అమరావతి: రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పాతపట్నంకు చెందిన నల్లి రాజు, మౌనికకు వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల మౌనికకు ఉదయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే భర్తను చంపేందుకు మౌనిక ప్లాన్ వేసింది. అతడి భోజనంలో నిద్రమాత్రలు కలిపి, ప్రియుడితో పాటు మరొకరితో కలిసి ఊపిరి ఆరడకుండా చంపేసింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం మొండి గొల్ల వీధికి చెందిన మృతుడు నల్లి రాజుకు మౌనిక అనే ఆమెతో సుమారు ఎనిమిది ఏళ్ల క్రితం వివాహం జరిగి వారికి ఇద్దరు మగ పిల్లలు సంతానం కలరు. మౌనిక కు పాతపట్నం మాదిగ వీధికి చెందిన గుండు ఉదయ్ కుమార్ తో వివాహేతర సంబందం ఏర్పడింది. ఉదయ్ కుమార్ అప్పటికే వివాహితుడు. ఈ సంబంధం విషయం భర్త రాజుకు తెలిసి కొంతకాలంగా భార్య, భర్తల మద్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో రాజును అంతం చేసి, ఉదయ్ తన భార్యకు కూడా విడాకులు ఇచ్చి, ఇద్దరు కలసి ఎక్కడికైనా వెళ్ళి వివాహం చేసుకొవాలని నిర్ణయించుకొని రాజు హత్యకు ఇద్దరూ కలసి పథకం వేశారు.
వారి పథకంలో బాగంగా రాజుతో, ఉదయ్ ఒక కొత్త ఫోన్ నెంబర్ తో అమ్మాయిలాగా సామాజిక మాధ్యమం వాట్సప్ లో గత రెండు నెలలు గా రాజుతో చాటింగ్ చేసి, ఎక్కడికైనా ఏకాంత ప్రదేశమునకు రప్పించి దాడి చేసి చంపాలని అనుకున్నారు. ఆ విధంగా పలు మార్లు ఉదయ్ అమ్మాయిలా రాజు తో చాట్ చేసినప్పటికీ రాజు వెళ్లలేధు. దీంతో వారు ఇరువురు రాజును ఇంటిలోనే నిద్ర మాత్రలు ఇచ్చి మత్తు కలిగించి ఆ తరువాత చంపాలని కుట్ర పన్నారు. అందుకోసం ఉదయ్ తన బావ మల్లికార్జున సహాయం కోరాడు. వారి కుట్రలో భాగంగా ఉదయ్ పర్లాకిమిడి లో ఒక ఆర్.యం.పి డాక్టర్ వద్ద నిద్ర మాత్రలు కొని, మౌనిక కు ఇచ్చాడు. మౌనిక తన భర్త రాజుకు హత్య కాబడిన ముందు రోజు తక్కువ మోతాదు (4 మాత్రలు) అన్నంలో గుండగా చేసి ఇచ్చి, రాజు మత్తులోకి వెళ్ళటం గమనించి, మత్తులో చంపవచ్చు అని నిర్ధారణకు వచ్చినారు.
మరుసటి రోజు రాత్రి అనగా 06.08.2025 రాత్రి, మోనిక ఆరు మాత్రలను రాజు కు భోజనంలో కలిపి పెట్టింది. అది తిన్న రాజు గాడ మత్తులోకి వెళ్లిపోయినాడు. రాజు మత్తులోకి వెళ్ళిన అనంతరం మౌనిక, తన ప్రియుడు ఉదయ్ కు తన ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. పథకం లో భాగంగా ఉదయ్ , మల్లికార్జున మొదట వీధి లైట్లు ఆపేసి రాత్రి 11.30 గంటల సమయం లో ఉదయ్ , మల్లిఖార్జున్ లు మౌనిక ఇంటికి వెళ్ళినారు.అనతరం మౌనిక, మల్లికార్జున కలసి కాళ్ళు చేతులు పట్టుకొని ఉండగా, ఉదయ్, మృతుడు రాజు ఛాతీ పై కూర్చొని, తలగడ తో రాజుని ఊపిరి ఆడకుండా చేసి చంపారు. ఆ తరువాత ఉదయ్ ముందుగా రాజు(మృతుడు) తాగి పడిపోయినట్లు చేయడం కోసం రాజు(మృతుడు) బండిని , ఒక మద్యం బాటిల్ ని, రాజు(మృతుడు) చెప్పుల జతను తీసుకొని ఎస్సీ విధి చివరన పెట్టి, వచ్చినాడు. అనంతరం మృతుడు తన చేతికి వేసుకున్న దేవుడు కడియాన్ని తీసి వేసి మృతుడు జేబులోనే పెట్టినారు.
ఆ తర్వాత మృతుడు లుంగీని తీసివేసి, టి షర్ట్ మరియు షార్ట్ తొడిగి, ఉదయ్ యొక్క స్కూటీ పై రాజు(మృతుడు) శవాన్ని ఉదయ్ మరియు మల్లికార్జునలు తీసుకువెళ్ళి ఎస్సీ విధి దిగువున రాజు (మృతుడు) బండి పెట్టిన చోటు న శవాన్ని పడవేసినారు.తదుపరి వారు ఇరువురు వారి ఇళ్లకు వెళ్లిపోయినారు. అనతరం రాజు(మృతుడు) భార్య మౌనిక ఎవరికీ అనుమానం రాకుండా ఉండుటకు గాను తన భర్త రాత్రి భయటకు వెళ్లి తిరిగి రాలేదని, తన అత్తకు తెలియపరిచి, మృతుడు మొబైలు ఫోన్ కు పదే పదే ఫోన్ చేసింది, ఆదేవిదంగా ఈ విషయమును తన కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి చెప్పింది. యదావిధిగా మృతుడు భార్య మౌనిక మరుసటి రోజు పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఏడుపు నటిస్తూ, తన భర్త మృతి పై పాతపట్నం పోలీసులకు ఫిర్యాధు చేసింది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పోలీసు వారు రాజు మృతి హత్య గా నిర్ధారించి దర్యాప్తును ముమ్మరం చేయగా విషయం తెలుసుకొని ముద్దాయిలు స్వచ్చందంగా రెవెన్యూ అధికారి వద్ద లొంగిపోయినారు.