ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. అల్లూరి జిల్లా పెదబయలు మండలం తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా తహసీల్ కార్యాలయంలోని పై గదిలోనే ఉంటున్న శ్రీనివాసరావు.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గురువారం అతడి గదికి వెళ్లిన సిబ్బంది అతడికి ఫోన్ చేసినా అతడి నుంచి స్పందన లేదు. కిటికిలోంచి చూడగా శ్రీనివాసరావు ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ మృతదేహాన్ని పరిశీలించారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో శ్రీనివాసరావు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇటీవల పాడేరు కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి తహశీల్దార్ శ్రీనివాసరావు వెళ్లారు. ఈ మీటింగ్‌లో భూముల రీ సర్వే విషయంలో ఆయనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మనస్థాపం చెంది శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.