ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లఖింపూర్‌ఖేరి జిల్లా మహ్మదీ పరిధిలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన బాలికను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆపై ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు మహ్మదీయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇదే విషయమై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. బాలిక సోదరుడు అదే గ్రామానికి చెందిన ఐదుగురి పేర్లతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వారిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. మహ్మదీయ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం గురించిన ఘటన శనివారం అర్థరాత్రి అందింది. బాలికను వైద్య పరీక్షలు, చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాలలో బాలిక తన గ్రామానికి చెందిన నలుగురు నిందితుల గుర్తింపును వెల్లడించింది. నిందితులపై ఐపీసీ, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టం 2012 (పోక్సో) కింద కేసు నమోదు చేయబడింది.