దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ద్వారకలో 16 ఏళ్ల బాలికపై తుపాకీ గురిపెట్టి ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత భవనంపై నుంచి బాలిక తోసేశాడని పోలీసులు గురువారం తెలిపారు. కిందపడటంతో కాలికి గాయమైన బాలిక ప్రస్తుతం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన స్నేహితుడే అయిన పొరుగింటి యువకుడు పిస్టల్ చూపించి, భవనంపైకి తీసుకెళ్లి, అత్యాచారం చేసి, ఆపై భవనంలోని నాల్గవ అంతస్తు నుండి నెట్టేశాడని బాలిక పేర్కొంది. బాలిక వాంగ్మూలాన్ని ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.
అందులో ఆమె తనపై అత్యాచారం జరిగిందని పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్లు 127 (2) (తప్పుగా నిర్బంధించడం), 65 (1) (16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళపై అత్యాచారానికి శిక్ష), 109 (1) (హత్య ప్రయత్నం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఫిబ్రవరిలో నలుగురిపై ఫిర్యాదు చేశారని, నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇటీవలి కేసులో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.