హైదరాబాద్: పెళ్లి పేరుతో నమ్మించి మహిళపై అత్యాచారం చేసి మోసం చేసిన కేసులో 42 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాగత్ కుమార్ భోయ్‌కు రంగారెడ్డి జిల్లాలోని స్థానిక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు కోర్టు అతనికి రూ.5,100 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే..2009 నుంచి బాధితురాలికి స్వాగత్ కుమార్‌తో పరిచయం ఉందని నవంబర్ 2017లో గచ్చిబౌలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. భోయ్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి చాలా సంవత్సరాలుగా ప్రలోభపెట్టాడని ఆమె ఆరోపించింది. కాగా నవంబర్ 28, 2017న ఒడిశాలో భోయ్ మరొక మహిళను వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని బాధితురాలు కనుగొంది. గొడవ జరిగిన తర్వాత, అతను ఆమెను మాటలతో దుర్భాషలాడాడని బాధితురాలు తెలిపింది. దీంతో పాటు ఆమెను, కుటుంబాన్ని బెదిరించాడని ఆరోపించారు. అయితే విస్తృత దర్యాప్తు , విచారణ తర్వాత, LB నగర్‌లోని XIII అదనపు జిల్లా సెషన్స్ జడ్జి భోయ్‌ను దోషిగా నిర్ధారించి శిక్షను ప్రకటించారు. సంవత్సరాల తరబడి వేధింపులు, చట్టపరమైన చర్యల తర్వాత బాధితురాలికి న్యాయం చేశారు.