శ్రీచైతన్య స్కూల్‌లో కలకలం.. విద్యార్థి అనుమానాస్పద మృతి
శ్రీ చైతన్య పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
By అంజి Published on 25 Jun 2024 11:45 AM ISTశ్రీచైతన్య స్కూల్‌లో కలకలం.. విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: శ్రీ చైతన్య పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. మెదక్ జిల్లాలోని చిలువేరు గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే విద్యార్థి హైదరాబాదు నగరంలోని కొంపల్లిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల కె4 క్యాంపస్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు. మల్లి కార్జున.. శ్రీ చైతన్య పాఠశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. నిన్ననే హాస్టల్ లో జాయిన్ అయ్యాడు. నిన్న రాత్రి సమయంలో భోజనం చేసి నిద్ర పోయాడు. ఈరోజు ఉదయ విద్యార్థులందరూ నిద్రలేచినా కూడా మల్లికార్జున నిద్రలేవకపోవడంతో హాస్టల్ సిబ్బంది వెళ్లి నిద్రలేపారు. అయినా కూడా మల్లికార్జునలో ఎటువంటి కదలిక లేకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది వెంటనే అతని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మల్లికార్జున్ ను పరీక్షించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. స్కూల్ సిబ్బంది మల్లికార్జున్ కు హార్ట్ ఎటాక్ వచ్చి మృతి చెందాడని అంటున్నారు.
హాస్టల్ వార్డెన్ వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని అందించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థి సంఘాలు పాఠశాల యజమాన్యం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున వచ్చి గొడవ చేసే అవకాశం ఉన్నట్లుగా భావించిన స్కూల్ యజమాన్యం వెంటనే స్కూల్ మెయిన్ గేట్ కి తాళం వేశారు. కొడుకు ఉన్నత చదువులు చదువుకొని వృద్ధిలోకి వస్తాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు ఇక ఆ కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్ళా డని తెలియడంతో గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.