వైజాగ్‌ లాడ్జీలో విషాదం.. బాత్రూమ్‌ కిటికీలకు ఉరివేసుకున్న ప్రేమ జంట

Srikakulam Love couple suicide in Visakhapatnam lodge. వైజాగ్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ లాడ్జీలో శ్రీకాకుళంకు చెందిన ప్రేమ జంట ఉరివేసుకుంది. ఎంతో గాఢంగా ప్రేమించుకున్న

By అంజి  Published on  19 Oct 2022 10:51 AM IST
వైజాగ్‌ లాడ్జీలో విషాదం.. బాత్రూమ్‌ కిటికీలకు ఉరివేసుకున్న ప్రేమ జంట

వైజాగ్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ లాడ్జీలో శ్రీకాకుళంకు చెందిన ప్రేమ జంట ఉరివేసుకుంది. ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వారిద్దరూ.. తమ వివాహానికి పెద్దలు అడ్డు చెబుతారనే భయంతోనే సూసైడ్‌ చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నకొత్తపేటకు చెందిన దామోదర్‌ (20) డిగ్రీ చదువుతుండగా, ఆముదాలవలస మండలం బలగాం గ్రామానికి చెందిన సంతోషి కుమారి (17) ఇంటర్‌ చదువుతోంది.

ఇటీవల వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. అంతలా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ప్రేమ జంట వైజాగ్‌లోని దరిగొల్లపాలెంలో ఓ లాడ్జీలో రూమ్‌ తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం అవుతున్నా.. వారు గది నుంచి బయటకు రాలేదు. దీంతో లాడ్జీ సిబ్బంది అనుమానంతో తలుపులు కొట్టారు. అయినా తీయకపోవడంతో పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులొచ్చి తలుపులను బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూశారు.

బాత్రూములోని కిటికీ గది ఊచలకు దామోదర్‌, సంతోషి కుమారి ఉరివేసుకుని కనిపించారు. యువతి మెడలో పసుపు తాడును పోలీసులు గుర్తించారు. అయితే ఈ జంట పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే.. కుటుంబ సభ్యులు ఒప్పుకోరని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసి ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story