పెళ్లికి నో చెప్పిందని.. నిప్పంటించుకుని ప్రియురాలిని కౌగిలించుకున్నాడు.. చివరికి

Spurned lover sets self on fire, hugs woman in Maharashtra. ప్రియురాలు పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.

By అంజి  Published on  22 Nov 2022 12:04 PM IST
పెళ్లికి నో చెప్పిందని.. నిప్పంటించుకుని ప్రియురాలిని కౌగిలించుకున్నాడు.. చివరికి

ప్రియురాలు పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని.. పక్కనే ఉన్న తన ప్రియురాలిని కౌగిలించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు పీహెచ్‌డీ విద్యార్థి నిప్పంటించుకుని, ఆపై తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న ఉద్దేశ్యంతో తన ప్రియురాలిని కౌగిలించుకున్నాడు. దీంతో ఇద్దరికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇద్దరూ జువాలజీలో పీహెచ్‌డీ విద్యార్థులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు బేగంపురా పోలీస్ స్టేషన్ పీఐ ప్రశాంత్ పోత్దార్ తెలిపారు. హనుమాన్ టెక్డిలో ఉన్న ప్రభుత్వ ఫోరెన్సిక్ కళాశాల బయోఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ క్యాబిన్‌లో యువతి తన ప్రాజెక్ట్‌ను చేస్తుండగా నిందితుడు లోపలికి ప్రవేశించారు. తన పెళ్లి ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించావంటూ అతను ఆ యువతిని ప్రశ్నించడం ప్రారంభించాడు.

అంతలోనే తనపైనా, మహిళపైనా పెట్రోల్‌ పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. అనంతరం ఆ యువకుడు మహిళను కౌగిలించుకున్నాడు. వీరిద్దరినీ చికిత్స నిమిత్తం ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పురుషుడికి 90% కాలిన గాయాలు కాగా, 55% కాలిన గాయాలతో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 307, 326ఎ, 354డి, 506,34 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story