బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. గన్ తో కాల్చిన పోలీసు

Spurned Bihar cop shoots woman getting bridal make-up at beauty parlour. మేకప్‌ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువుపై ఒక పోలీస్‌ గన్‌తో కాల్పులు జరిపాడు.

By M.S.R  Published on  22 May 2023 6:26 PM IST
బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. గన్ తో కాల్చిన పోలీసు

మేకప్‌ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువుపై ఒక పోలీస్‌ గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకునేందుకు ప్రయత్నించాడు. పార్లర్‌ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బీహార్‌లోని ముంగేర్‌లో ఈ సంఘటన జరిగింది. తారాపూర్ డయారాలోని మహేశ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఆదివారం ఒక వ్యక్తితో పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో ఆమె మేకప్‌ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఒక వ్యక్తి ఆ వధువు వెనుకే ఆ బ్యూటీ పార్లర్‌కు చేరుకున్నాడు. అపూర్వ కుమారిని వెనుక నుంచి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో ఒక బుల్లెట్‌ ఆమె కుడి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ గన్‌తో తనను తాను కాల్చుకునేందుకు అతడు ప్రయత్నించాడు. బ్యూటీ పార్లర్‌ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. గన్‌ కాల్పుల్లో గాయపడిన వధువు అపూర్వ కుమారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని డాక్టర్లు తెలిపారు. పెళ్లికుమార్తె తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బ్యూటీ పార్లర్‌ వద్దకు చేరుకుని పరిశీలించారు. ఒక పిస్టల్‌, వినియోగించిన బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. జరిగిన సంఘటన గురించి పార్లర్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. పెళ్లికుమార్తె అపూర్వ కుమారిపై కాల్పులు జరిపిన నిందితుడు పాట్నాలో పోలీస్‌గా పని చేస్తున్న అమన్‌ కుమార్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.


Next Story