సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు. ఈ విషయమై రైల్వే ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచార ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు. బాధితురాలు స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు. మహిళా భోగిలో ఓ అజ్ఞాత వ్యక్తి ప్రయాణించాడని పేర్కొన్నారు. అల్వాల్ వరకు ముగ్గురు మహిళలు ఉండగా.. అల్వాల్ స్టేషన్ దాటిన తర్వాత బాధితురాలు ఒక్కతే ఉందని గమనించిన ఆ నిందితుడు.. ఆమెపైన లైంగిక దాడికి యత్నించాడు. తన కోరిక తీర్చాలంటూ ట్రైన్‌లో యువతిని ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన చెందిన బాధితురాలు నడుస్తున్న ట్రైన్ నుండి కిందకు దూకింది. దీంతో బాధితురాలకు తలకు బలమైన గాయం అయింది. 24 గంటల పాటు బాధితురాలను అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు. నిందితుడు ఆచూకీ కోసం 4 టీమ్స్ ఏర్పాటు చేశామని.. ఈ కేసులో టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేస్తామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు.