సంగారెడ్డిలో దారుణం.. మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు

సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతూ తన మామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు.

By -  అంజి
Published on : 12 Dec 2025 12:23 PM IST

Son-in-law stabs uncle, Beeramguda, Sangareddy district, Crime

సంగారెడ్డిలో దారుణం.. మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు

సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతూ తన మామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్‌పూర్‌ పరిధిలోని బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య.. తన కూతురు లక్ష్మిని రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే రామకృష్ణ మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.

అంతేకాకుండా కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించడంతో లక్ష్మి భరించలేక పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వచ్చేసింది. దీంతో రామకృష్ణ ప్రతిరోజు అత్తింటికి రావడం మామతో గొడవ పెట్టుకోవడం నిత్య కృత్యం అయ్యింది. నిన్న రాత్రి సమయంలో కూడా అల్లుడు రామకృష్ణ పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో అత్తారింటికి వచ్చి మామ చంద్రయ్యతో తన భార్యను ఇంటికి పంపించాలంటూ గొడవపడ్డాడు. అయితే అందుకు చంద్రయ్య నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అల్లుడు రామకృష్ణ ఒక్కసారిగా చంద్రయ్య పై కత్తితో దాడి చేసి పొడిచి చంపేశాడు.

అయితే హత్య చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు వస్తుంటే మిమ్మల్ని కూడా చంపేస్తానని రామకృష్ణ బెదిరింపులకు గురిచేసాడు. మామ చంద్రయ్యను హత్య చేసి అనంతరం అల్లుడు రామకృష్ణ అక్కడినుండి పారిపోయాడు. తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం కావడంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే అమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రామకృష్ణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story