అనారోగ్యం ఉన్న తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఓ తల్లి తన కుమారుడిని కోరింది. దీంతో ఆగ్రహించిన కుమారుడు తల్లిని విచక్షణారహితంగా కొట్టి, రాయితో తలబాది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో జరిగింది.
అమ్లిపాదార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చందన్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హీరాబాయి నిషాద్ (47) అమ్లిపాదార్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుమారుడు ధన్‌సింగ్ నిషాద్ (24) ని బుధవారం ఉదయం కోరింది. కోపోద్రిక్తుడైన ధన్‌సింగ్ తల్లితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో గొడవ కాస్త పెద్దదైంది.
అంతే.. ఆగ్రహంతో ఊగిపోతూ ధన్‌సింగ్.. హీరాబాయిని కొట్టడం మొదలు పెట్టాడు. తల్లి అరుపులు విన్న ఆమె ఇద్దరు కుమార్తెలు రక్షించేందుకు వచ్చారు. చెల్లెలు అని చూడకుండా వారి పైనా దాడి చేశాడు. కుమారుడి నుండి తప్పించుకునేందుకు హీరాబాయి ఇంటి వెనుక ఉన్నపొలంలోకి పరుగులు తీసింది. అయినప్పటికి ధన్‌సింగ్ వదలకుండా తల్లి వెనుక పరిగెత్తుతూ.. ఓ రాయిని తీసుకుని తల్లి తలపై బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.