విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుమృతి
Six Tourists from MP Dies After Drowning in Ramdaha Waterfall.జలపాతం అందాలను చూసేందుకు వెళ్లారు.
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2022 2:45 AM GMTజలపాతం అందాలను చూసేందుకు వెళ్లారు. అక్కడి అందాలను చూస్తూ మైమరిచిపోయారు. కాసేపు సరదాగా గడిపిన అనంతరం స్నానం చేయాలని భావించారు. ఓ ప్రదేశంలో స్నానం చేస్తూ వారిలో ఏడుగురు గల్లంతై.. మృతి చెందారు. దీంతో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. ఈ ఘటన ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటడోల్ పీఎస్ పరిధి సరిహద్దులో దిగువన ఉన్న రామ్‌దహా వద్దకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాకు 15 మంది కుటుంబ సభ్యులు ఆదివారం వెళ్లారు. కాసేపు అక్కడి అందాలను వీక్షించారు. అనంతరం ప్లంజ్‌పూల్‌లో స్నానం చేస్తుండగా.. లోతు, ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఏడుగురు గల్లంతు అయ్యారు. మిగతా కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్థానిక అధికారులకు, రెస్య్కూ సిబ్బందికి సమాచారం అందించగా..అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఇద్దరిని నీటిలోంచి బయటకు తీసుకువచ్చారు.
వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఒకరు మృతి చెందగా మరొకరు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. రాత్రి వరకు మరో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. రాత్రి కావడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. సోమవారం ఉదయాన్నే గాలింపు చేపట్టారు. మిగిలిన ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. వీరిని శ్వేతా సింగ్ (22), శ్రద్ధా సింగ్ (14), అభయ్ సింగ్ (22)గా గుర్తించినట్లు కొరియా కలెక్టర్ కుల్దీప్ శర్మ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నట్లు తెలిపారు.
కాగా.. ఆ జలపాతంలో ప్రజలు స్నానం చేయవద్దని హెచ్చరిక బోర్డును సైట్‌లో ఉంచినప్పటికీ పర్యాటకులు లోతైన నీటిలోకి వెళ్లినట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు.