భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Six Maoists killed in encounter in forest near Kothagudem.తెలంగాణ‌-చ‌త్తీస్‌గ‌డ్ స‌రిహ‌ద్దుల్లో భారీ ఎన్‌కౌంట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 4:34 AM GMT
భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

తెలంగాణ‌-చ‌త్తీస్‌గ‌డ్ స‌రిహ‌ద్దుల్లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నాపురం సమీపంలోని సుక్మా, బీజాపుర్ జిల్లాల అటవీ ప్రాంతంలో ఈ ఉద‌యం 6 నుంచి 7.30గంట‌ల మ‌ధ్య తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మ‌ధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతి చెందిన వారిలో న‌లుగురు మ‌హిళా న‌క్స‌ల్స్ తో పాటు చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయ‌ని.. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు.

గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఏరియాలో మావోయిస్టులు పలు విధ్వంసాలకు పాల్పడడంతో ఈ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పెసర్లపాడు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. గ్రేహౌండ్స్ ద‌ళాల‌పై మావోయిస్టులు కాల్పులకు పాల్ప‌డ్డారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన గ్రేహౌండ్స్ ద‌ళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయ‌ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్‌పీఎస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయన్నారు.

కాగా.. వారం రోజుల క్రితం చెన్నాపురం ఏరియాలో మావోయిస్టులు మందు పాతర పెట్టిన ఘటనలో ఒక ఆర్ఎస్ఐ, జవాన్ గాయపడ్డారు. అదే విధంగా రెండు రోజుల క్రితం వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసి మావోయిస్టులు హత్య చేసిన సంగ‌తి తెలిసిందే.

Next Story