ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై కారును ఢీకొట్టిన తర్వాత వేగంగా వచ్చిన ట్రక్కు పాదచారులను ఢీకొట్టడంతో కనీసం ఆరుగురు మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తెలిసిన వివరాల ప్రకారం.. లక్నో-కాన్పూర్ హైవేపై అచల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్ మార్గ్ క్రాసింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వేగంగా వచ్చిన డంపర్.. కారు, బైక్‌ను ఢీకొట్టి, ఆజాద్ మార్గ్ కూడలి వద్ద పలువురు పాదచారులపై నుంచి వెళ్లింది. అదే సమయంలో డంపర్ నాలుగు చక్రాల వాహనాన్ని ఈడ్చుకెళ్లి కాలువలో పడింది. ట్రక్కు ఢీకొన్న కారులో దాదాపు నలుగురైదుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం అనంతరం స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
ఆ ప్రాంతంలోని స్థానికులు రాళ్లదాడి చేయడంతో రోడ్డు మార్గంలో ఉన్న బస్సు కూడా ధ్వంసమైంది. కోపోద్రిక్తులైన జనాలు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశారు. భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని హైవేపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.