ఘోరం.. పుణెలో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కుప్ప‌కూలి ఆరుగురు దుర్మ‌ర‌ణం

Six killed as slab at under-construction building collapses in Pune.మ‌హారాష్ట్ర‌లోని పుణెలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 7:52 AM IST
ఘోరం.. పుణెలో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కుప్ప‌కూలి ఆరుగురు దుర్మ‌ర‌ణం

మ‌హారాష్ట్ర‌లోని పుణెలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు కార్మికులు మృతి చెంద‌గా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

వివ‌రాల్లోకి వెళితే.. పుణెలోని ఎర‌వాడ శాస్త్రీన‌గ‌ర్‌లో ఓ షాపింగ్ మాల్ క‌డుతున్నారు. ఈ క్ర‌మంలో స్లాబ్ వేస్తున్నారు. గురువారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో స్లాబ్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. ఆ స్లాబ్ కింద 10 మంది వ‌ర‌కు కూలీలు ఉన్నారు. ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఆరుగురు కూలీలు మ‌ర‌ణించ‌గా.. మిగ‌తా వారు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ర‌క్షించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

'ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులు చనిపోయారని, వారి మృతదేహాలను న‌గరంలోని సాసూన్ ఆసుపత్రికి తరలించారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. తదుపరి విచారణలు జరుగుతున్నాయి అని' పుణె డీసీపీ రోహిదాస్ ప‌వార్‌ తెలిపారు. బాధితులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. అయితే.. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా.. 2019 జూన్‌లో నగరంలోని కొంద్వా ప్రాంతంలో గోడ కూలిన సంఘటనలో 15 మంది కార్మికులు మరియు వారి బంధువులు (నలుగురు పిల్లలతో సహా) మరణించిన సంగ‌తి తెలిసిందే.

Next Story