ప్రముఖ గాయకుడు, స్వరకర్త సంజయ్ చక్రవర్తి తన సింగింగ్ క్లాస్ తర్వాత మైనర్ విద్యార్థిని వేధించాడనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండు నెలలకు పైగా పోలీసుల నుంచి తప్పించుకున్న అతడిని ముంబైలో అరెస్టు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద చక్రవర్తి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. బుధవారం అలీపూర్ కోర్టులో హాజరుపరచగా, నవంబర్ 18 వరకు పోలీసు కస్టడీకి పంపారు. ఆరోపించిన వేధింపుల సంఘటన గత జూన్‌లో జరిగింది.
చక్రవర్తి హైస్కూల్ పక్కన ఉన్న యోగా ఇన్‌స్టిట్యూట్‌లో గానం క్లాసులు తీసుకున్నాడు. చక్రవర్తి తన క్లాస్‌లో 15 ఏళ్ల బాలికను వేధించాడని ఆరోపణలు వచ్చాయి. అతను క్లాస్ ముగిసే వరకు వేచి ఉన్నాడు. అందరూ వెళ్లిన తర్వాత చక్రవర్తి.. బాధిత అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్‌ని తాకుతూ లైంగికంగా వేధించాడు. ఈ ఘటనతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళ్లారు.
చికిత్స సమయంలో, బాలిక తన వైద్యుడితో మొదటి సారి జరిగిన మొత్తం సంఘటన గురించి మాట్లాడింది. సెప్టెంబరులో, ఆమె తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత, వారు తమ ఫిర్యాదు లేఖను ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బెల్ఘరియా పోలీస్ స్టేషన్‌కు మెయిల్ చేశారు. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆరోపించిన నేరం వారి అధికార పరిధిలో జరిగినందున దర్యాప్తు కోసం కోల్‌కతాలోని చారు మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. సంజయ్ చక్రవర్తిపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.