విషాదం.. వివాహ‌మైన వారం రోజుల‌కే ఎస్ఐ మృతి

SI dead in road accident at Nalgonda District.కొత్త సంవ‌త్స‌రం తొలి రోజున ర‌హ‌దారులు ర‌క్త‌మోడాయి. న‌ల్ల‌గొండ జిల్లాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jan 2022 2:53 AM GMT
విషాదం.. వివాహ‌మైన వారం రోజుల‌కే ఎస్ఐ మృతి

కొత్త సంవ‌త్స‌రం తొలి రోజున ర‌హ‌దారులు ర‌క్త‌మోడాయి. న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆటోను ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వికారాబాద్ వ‌న్‌టౌన్ ఎస్ఐతో పాటు ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండ‌లం మాన్యానాయ‌క్ తండాకు చెందిన శ్రీను నాయ‌క్‌(30) వికారాబాద్ వ‌న్‌టౌన్ ఎస్ఐగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. శ్రీనుకు డిసెంబ‌ర్ 26న వివాహం జ‌రిగింది.

ఒడిబియ్యం కార్య‌క్ర‌మం ఉండ‌డంతో తండ్రి మాన్యానాయక్‌(55)తో క‌లిసి హైద‌రాబాద్ నుంచి ఆటోలో స్వ‌గ్రామం మాడుగుల‌కు వెళ్లారు. అక్క‌డ కార్య‌క్ర‌మం పూర్తి అయిన అనంత‌రం తిరుగు ప్ర‌యాణం అయ్యారు. చింత‌ప‌ల్లి మండ‌లం పోలెప‌ల్లి రాంన‌గ‌ర్ గ్రామ ప‌రిధిలోకి రాగానే హైద‌రాబాద్ నుంచి దేవ‌ర‌కొండ వెలుతున్న ఆర్టీసీ బ‌స్సు ఆటోను ఢీ కొట్టింది. ప్ర‌మాదం దాటికి ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఎస్ఐ శ్రీను నాయ‌క్‌తో పాటు అత‌డి తండ్రి మాన్యానాయ‌క్ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం దేవ‌ర‌కొండ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆర్టీసీ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోను శ్రీను నాయ‌క్ న‌డిపిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story
Share it