బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

పాట్నా జిల్లాలోని మసౌర్హి-పిట్వాన్స్ రోడ్డులోని నురా బజార్ వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

By అంజి  Published on  24 Feb 2025 12:41 PM IST
Seven Killed , Bihar, Road accident, Villagers Block Road, Protest

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

పాట్నా జిల్లాలోని మసౌర్హి-పిట్వాన్స్ రోడ్డులోని నురా బజార్ వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే నేతృత్వంలో స్థానికులు సోమవారం రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రేఖా దేవి, గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించారు. ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ప్రతి బాధితుడి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.

"ఇది చాలా బాధాకరమైన ఘటన. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మేము సంఘటన స్థలంలోనే ఉన్నాము. మృతులందరిపై ఆధారపడిన వారికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాము" అని దేవి అన్నారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు, మృతదేహాలను ఆ ప్రదేశం నుండి తొలగించడానికి జిల్లా యంత్రాంగాన్ని గ్రామ సంఘం అనుమతించదని ఆమె పేర్కొంది.

సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్థానికులు ఆరోపించారు. ప్రమాదం తరువాత, నివాసితులు రోడ్డును దిగ్బంధించి, పరిహారం చెల్లించాలని, ఢీకొన్న ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దిగ్బంధనం కారణంగా ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు సహాయం చేయడానికి సహాయక చర్యలను ప్రారంభించారు.

పాట్నా నుండి ఖరత్ గ్రామానికి తిరిగి వస్తున్న కార్మికులను తీసుకెళ్తున్న ఆటో రిక్షా, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న నీటి వనరుల్లోకి దూసుకెళ్లాయి. ఆటో రిక్షా ట్రక్కు కింద మునిగిపోయింది. మృతులను మతేంద్ర బింద్ (25), వినయ్ బింద్ (30), ఉమేష్ బింద్ (38), రమేష్ బింద్ (52), టెంపో డ్రైవర్ సుశీల్ కుమార్ (35), ఉమేష్ బింద్ (30), సూరజ్ ఠాకూర్ (20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

Next Story