ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు స‌జీవ ద‌హ‌నం.. సీఎం విచారం

Seven die after fire breaks out in shanties of Delhi's Gokulpuri area.దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2022 10:03 AM IST
ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు స‌జీవ ద‌హ‌నం.. సీఎం విచారం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 60 గుడిసెల‌కు మంట‌లు అంటుకుని ఏడుగురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో అర్థ‌రాత్రి 1 గంట ప్రాంతంలో ఓ గుడిసెలో మంట‌లు చెల‌రేగాయి. మంట‌లు వేగంగా ప‌క్క‌నే ఉన్న గుడిసెల‌కు వ్యాపించాయి. ఇలా సుమారు 60 గుడిసెల‌కు మంట‌లు అంటుకున్నాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే 13 ఫైరింజ‌న్లు అక్క‌డ‌కు చేరుకున్నాయి. దాదాపు మూడు గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

అర్ధరాత్రి 1 గంటలకు అగ్నిప్రమాదం గురించి త‌మ‌కు ఫోన్ వ‌చ్చింద‌ని వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలం నుండి ఏడు మృతదేహాలను వెలికితీశారు. గోకుల్‌పురిలోని పిల్లర్ నంబర్ 12 సమీపంలో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు. "ఉదయం తెల్లవారుజామున విచారకరమైన వార్త విన్నాను. నేను సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తాను" అని ఆయన హిందీలో ఓ ట్వీట్ చేశారు.

కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని డీఎస్పీ దేవేశ్‌ కుమార్‌ మహ్లా చెప్పారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఏడు మృత‌దేహాలు ల‌భించాయ‌ని, వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.


Next Story