జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన మలుపు
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ రత్నం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
By - Knakam Karthik |
జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన మలుపు
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ రత్నం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఒక మైనర్ బాలుడు సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. 25 ఏళ్ల పగకు సుదేష్ సింగ్ కుమారులు తెరదించాడు. 2000 సంవత్సరంలో దూల్‌పేట్‌లో లోకల్ డాన్ సుదేష్ సింగ్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ సమయంలో సుదేష్ సింగ్‌కు డ్రైవర్‌గా వెంకట్ రత్నం పని చేసేవాడు. వెంకట్ రత్నం ఇచ్చిన సమాచారమే తమ తండ్రి ఎన్‌కౌంటర్‌కు కారణమని సుదేష్ సింగ్ కుమారుడు చందన్ సింగ్ అనుకున్నాడు. అప్పటి నుంచి వెంకట్ రత్నంపై పగ పెంచుకున్నాడు. కుటుంబం 25 సంవత్సరాలుగా అతడి కోసం గాలింపు సాగించినట్లు విచారణలో బయటపడింది.
వెంకట్ రత్నం కదలికల వివరాలు తెలుసుకోవడానికి నిందితులు ఒక మైనర్ బాలుడిని ఉపయోగించారు. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్‌లా నటిస్తూ వ్యాపారి ఇంటి చుట్టుపక్కల చందన్ సింగ్ రెక్కీ నిర్వహించాడు. వ్యాపారి తన కూతుర్ని స్కూల్‌కి వదిలి ఇంటికి తిరిగి వస్తున్న వేళ నిందితుడు కాల్చి, కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. చందన్ సింగ్, మైనర్ బాలుడు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక రివాల్వర్, 15 రౌండ్ల బుల్లెట్లతో పాటు, కత్తులు స్వాధీనం చేశారు. హత్య అనంతరం నిందితులు శాహనాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి, తర్వాత వారిని జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. చందన్ సింగ్ తో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.