మీర్‌పేట్ భవాని హత్య కేసు.. భార్యను ముక్కలుగా నరకడానికి గల కారణం అదే!.. వెలుగులోకి సంచలన విషయాలు
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మీర్పేట్ భవాని హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. భవాని, గురుమూర్తి ఇద్దరు దంపతులు..
By - అంజి |
మీర్‌పేట్ భవాని హత్య కేసులో.. భార్యను ముక్కలుగా నరకడానికి గల కారణం అదే!.. వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మీర్పేట్ భవాని హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. భవాని, గురుమూర్తి ఇద్దరు దంపతులు.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గురుమూర్తి, భవానిని అతి దారుణంగా హత్య చేశాడు. ఎటువంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే గురుమూర్తి తన భార్య భవానీ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటిని బాగా ఉడకపెట్టి కాల్చివేసి బూడిదను తీసుకువెళ్లి చెరువులో పడేసాడు. అయితే ఈ కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించగా గురుమూర్తి భార్యను అతి దారుణంగా హత్య చేసినట్లుగా నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్టు చేశారు.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగించగా విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురుమూర్తి భార్యను హత్య చేయడానికి వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారణ అయింది. గురుమూర్తి.. తన భార్య భవాని చెల్లెలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు తెలియకుండా ఆ సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఈ విషయం కాస్త భవానికి తెలిసింది. దీంతో భవాని భర్తను నిలదీసి అడిగింది. ఆగ్రహానికి లోనైనా గురుమూర్తి ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో భవాని భర్త గురుమూర్తికి నచ్చ చెప్పే విధంగా పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. పెద్దలందరూ కలిసి గురుమూర్తికి నచ్చ చెప్పారు.
అయినా కూడా గురుమూర్తి ప్రవర్తనలో మార్పు రాలేదు. అదేవిధంగా మరదలుతో ప్రేమాయణం కొనసాగించాడు.. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండేది. ఈ ఏడాది జనవరి నెలలో ఇదే విషయంపై గురుమూర్తి, భవాని మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. ఆగ్రహానికి లోనైనా గురుమూర్తి ఒక్కసారిగా భార్యపై దాడి చేసి చంపేశాడు. అనంతరం ఎటువంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా ఉండేందుకు భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి కాల్చివేసి బూడిద చేసి చెరువులో పడేశాడు. పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత తాను చెరువులో బూడిదను పడేసానని గురుమూర్తి చెప్పాడు.
దీంతో పోలీసులు ఇంట్లో, చెరువులో క్షుణ్ణంగా తనిఖీ చేసి సైంటిఫిక్ ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. అనంతరం పోలీసులు గురుమూర్తి గురించి దర్యాప్తు చేయగా... గురుమూర్తికి తన మరదలుతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ వివాహేతర సంబంధం కారణంగానే తన భార్య భవానిని అతి దారుణంగా హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది.. కోర్టు విచారణలో వెలుగులోకి వస్తున్న ఈ విషయాలు ప్రజలను మరింత షాక్‌కి గురిచేశాయి. ఈ కేసులో గురుమూర్తి పై హత్యతో పాటు ఆధారాలను నాశనం చేసిన నేరాల కింద గట్టి అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై కోర్టులో తదుపరి విచారణ ఇంకా కొనసాగుతున్నది.