ఇటీవల ర్యాగింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇంజినీరింగ్ కాలేజీలకు మాత్రమే పరిమితమైన ర్యాగింగ్ భూతం ఇప్పుడు పాఠశాలలకు పాకింది. మూడో తరగతి చదువుతున్న విద్యార్థితో నలుగురు సీనియర్ విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారు. దాడి చేసి బాలుడి మర్మాంగానికి దారం కట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
కిద్వాయ్‌నగర్ ఈస్ట్‌లోని అటల్ ఆదర్శ్ అనే ప్రభుత్వ పాఠశాలలో 8 ఏళ్ల ఓ బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 24న బాలుడు పాఠశాలకు వెళ్లాడు. విరామ సమయంలో బాలుడు టాయిలెట్‌కు వెళ్లగా 16 సంవత్సరాల వయస్సు గల నలుగురు సీనియర్ విద్యార్థులు బాలుడిని ఆపారు. బాలుడిపై దాడి చేశారు. అనంతరం బాలుడి మర్మాంగానికి దారం కట్టారు. ఆ దారాన్ని తీయవద్దని హెచ్చరించారు. విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు.
దీంతో బాలుడు తీవ్రంగా భయపడిపోయాడు. నొప్పితో రెండు రోజులు పాఠశాలకు వెళ్లలేదు. బుధవారం బాలుడు స్నానం చేస్తుండగా.. మర్మాంగానికి దారం కట్టిఉండడాన్ని చూసి బాలుడి తండ్రి ప్రశ్నించాడు. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం ఏడుస్తూ బాలుడు తండ్రికి వివరించాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.