ఔరంగాబాద్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) ఒక మహిళను వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. మద్యం మత్తులో వారి ఇంట్లోకి చొరబడి ఆమె భర్త, అత్తపై కూడా దాడి చేశాడు. మహిళ వాంగ్మూలం ఆధారంగా ఏసీపీ విశాల్ ధుమేపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహిళ వాంగ్మూలం ప్రకారం.. ఆమె కుటుంబం రాత్రి భోజనానికి వెళ్లగా.. అక్కడ ACP ధూమే తన స్నేహితుడితో మరొక టేబుల్ వద్ద ఉన్నారు. తనను పోలీస్ కమిషనరేట్ వద్ద డ్రాప్ చేయాలని మహిళ భర్తను కోరాడు.. వారి కారులో కూర్చొని మహిళను వేధించాడు. ఆ తర్వాత వాష్‌రూమ్‌ను వినియోగించుకోవాలని ఏకంగా ఇంటికి చేరుకున్నాడు. బెడ్ రూమ్ లోని టాయిలెట్‌ను మాత్రమే ఉపయోగిస్తానని గొడవకు దిగాడు. మహిళ అత్త, భర్త శాంతింపజేసేందుకు ప్రయత్నించగా అతడు వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా ఏసీపీ.. తన భర్తను కొట్టినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళ, ఆమె కుటుంబ సభ్యులు పోలీసు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించారు. పోలీసులు వచ్చి ఏసీపీని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మద్యం మత్తులో అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సిటీ చౌక్ పోలీస్ స్టేషన్‌లో 354, 354డి, 452, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.