భూమా అఖిల‌ప్రియ‌కు కోర్టులో మ‌రోసారి చుక్కెదురు

Secunderabad Court denies bail for Akhila Priya.ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు సికింద్రాబాద్ కోర్టులో మ‌రోసారి చుక్కెదురు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2021 10:54 AM GMT
భూమా అఖిల‌ప్రియ‌కు కోర్టులో మ‌రోసారి చుక్కెదురు

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు సికింద్రాబాద్ కోర్టులో మ‌రోసారి చుక్కెదురైంది. బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు మ‌రోసారి నిరాక‌రించింది. పోలీసులు ఆమెపై అద‌న‌పు సెక్ష‌న్లు న‌మోదుచేసిన‌ట్లు న్యాయ‌స్థానంలో మెమో దాఖ‌లు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)కేసుని కూడా పోలీసులు నమోదు చేశారు. దీంతో జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావన్న సికింద్రాబాద్ కోర్ట్ బెయిల్ పిటీషన్ రీటర్న్ చేసింది. దీంతో ఇప్పుడు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ వేయనున్నారు అఖిల ప్రియ తరపు న్యాయవాదులు.

ఇప్పటికే అఖిలప్రియను కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే, అఖిలప్రియ ఈ కేసులో ప్రధాన నిందితురాలని, ఆమెను విడుదల చేస్తే ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె భర్త, ఇతరులు దొరక్కపోవచ్చని, ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల వాద‌న‌తో ఏకీభ‌వించిన సికింద్రాబాద్ కోర్టు.. ఈ కేసులో అద‌న‌పు సెక్ష‌న్లు న‌మోదు చేసినందున తాము బెయిల్ ఇవ్వ‌లేమ‌ని పైకోర్టుకు వెళ్లాలంటూ అఖిలప్రియ‌కు సూచించింది.




Next Story