వారం రోజులుగా నా తల్లి నాన్న‌ను చంపేస్తానని బెదిరిస్తోంది.. మాజీ డీజీపీ కుమారుడు

ఆదివారం సాయంత్రం హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని తన నివాసంలో హత్యకు గురైన కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాష్ భార్య, కుమార్తెపై కేసు నమోదైంది.

By Medi Samrat
Published on : 21 April 2025 4:24 PM IST

వారం రోజులుగా నా తల్లి నాన్న‌ను చంపేస్తానని బెదిరిస్తోంది.. మాజీ డీజీపీ కుమారుడు

ఆదివారం సాయంత్రం హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని తన నివాసంలో హత్యకు గురైన కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాష్ భార్య, కుమార్తెపై కేసు నమోదైంది. ఆయన కుమారుడు కార్తికేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. "ఈ బెదిరింపుల కారణంగా.. మా నాన్న తన సోదరి సరితా కుమారి ఇంట్లో ఉండటానికి వెళ్ళాడు" అని కార్తికేశ్‌ చెప్పాడు. "రెండు రోజుల క్రితం.. నా చెల్లెలు కృతి కుమారి.. సరితా కుమారి ఇంటికి వెళ్లి, ఇంటికి తిరిగి రావాలని మా నాన్న ఓం ప్రకాష్‌ను ఒత్తిడి చేసింది. ఆమె అతని ఇష్టం లేకుండా అతన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చింది" అని కార్తికేష్ ఆరోపించారు.

గత వారం రోజులుగా తన తల్లి పల్లవి తన తండ్రిని చంపేస్తానని బెదిరిస్తోందని కార్తికేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో కార్తీకేష్ డోమ్లూర్‌లోని కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్‌లో ఉండగా, పొరుగున ఉన్న జయశ్రీ శ్రీధరన్ తన తండ్రి కింద స్పృహతప్పి పడి ఉన్నాడని తెలియజేసేందుకు ఫోన్ చేశాడు. "నేను ఇంటికి పరుగెత్తాను (హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఉంది). అక్కడ‌ పోలీసు అధికారులు, ఇత‌ర‌ వ్యక్తులు కనిపించారు. మా నాన్న తల, శరీరంపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని శరీరం పక్కన ప‌గిలిన బాటిల్, కత్తి ఉన్నాయి. తరువాత అతన్ని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు," అని అతను వివరించాడు.

మా అమ్మ పల్లవి, మా సోదరి కృతి తరచూ మా నాన్నతో గొడవ పడుతుండేవారని.. మా నాన్న హత్యలో వీరి హస్తం ఉందని బలంగా అనుమానిస్తున్నానని.. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని కార్తికేశ్ అన్నారు.

విచారణ తర్వాత, కేసుకు సంబంధించి పల్లవి, దంపతుల కుమార్తె కృతి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

రిటైర్డ్ IPS అధికారి అయిన‌ ఓం ప్రకాష్(68) బీహార్‌లోని చంపారన్‌కు చెందినవారు. ఆయ‌న‌ జియాలజీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. మార్చి 1, 2015న కర్ణాటక డీజీపీగా నియమితులయ్యారు. హత్యకు దారితీసిన ప‌రిస్థితులపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story