సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మరోమారు ఫ్యాక్షన్ పగలు భగ్గుమన్నాయి. వివరాళ్లోకెళితే.. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం కోమనూతల సర్పంచ్ దారుణహత్యకు గురయ్యారు. వైసీపీకి చెందిన సర్పంచ్ చిన్నమునెప్ప(50)ను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. చిన్నమునెప్ప సర్పంచ్‌ల శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు పులివెందులకు వెళ్లి.. బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. గ్రామ శివారులో మాటువేసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి హత్యచేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 150 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా మునెప్ప గెలుపొందారు. రాజకీయ కక్షలతోనే మునెప్పను హత్యచేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మునెప్ప మర్డర్‌తో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.