సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి.. తన ప్రియురాలి ప్రాణం తీశాడు. ప్రేమోన్మాది ప్రవీన్.. తన ప్రియురాలు రమ్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. రామచంద్రపురం పోలీసుల కథనం ప్రకారం.. ప్రవీణ్, డిగ్రీ చదువుతున్న రమ్య గతంలో ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల నుంచి తనను దూరం పెడుతోందని కోపంతో రగిలిపోయిన ప్రవీణ్.. ఆమెతో మాట్లాడేందుకు ఇవాళ ఇంటికి వెళ్లాడు. ఇవాళ ఉదయం రమ్య ఇంటికి వచ్చిన ప్రవీణ్.. ఆమెతో కాసేపు మాట్లాడాడు.
ఏదో విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించింది. అనంతరం తానూ అదే కత్తితో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. నిందితుడు ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.