గుజరాత్‌లోని సూరత్‌లో ఎంబ్రాయిడరీ సంస్థ యజమానిని, అతని తండ్రి, మామను ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. హత్యకు పాల్పడిన వ్యక్తుల్లో ఒకరిని ఇటీవలే ఉద్యోగం నుండి తొలగించడంతో.. అతడు కోపంతో ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. సూరత్ నగరంలోని అమ్రోలి ప్రాంతంలోని అంజనీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వేదాంత్ టెక్సోలో కంపెనీలో ఈ ట్రిపుల్ మర్డర్ జరిగిందని అధికారులు తెలిపారు. సూరత్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారని, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
"నిందితుడు, అతని సహచరుడు ఆదివారం ఉదయం కంపెనీలోకి వచ్చారు. యూనిట్ యజమాని, అతని తండ్రి, మామను కత్తితో పొడిచి చంపారు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) (జోన్ 5) హర్షద్ మెహతా తెలిపారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారిని కల్పేష్ ధోలాకియా (36), ధంజీ ధోలకియా (61), ఘనశ్యాం రాజోడియా (48)గా గుర్తించారు. "ఎంబ్రాయిడరీ సంస్థ యజమాని.. ఉద్యోగి మధ్య ఏర్పడిన విభేదాలు ముగ్గురు వ్యక్తుల హత్యకు దారితీశాయి. నిందితుడిని విచారించగా, 10 రోజుల క్రితం నైట్ షిఫ్ట్ సమయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిందితుడిని ఉద్యోగం నుండి తీసేశాడు. దీంతో అతడు కక్ష పెంచుకున్నాడు" అని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు పదునైన ఆయుధాలతో కర్మాగారంలోకి వెళ్లి బాధితులను పలుమార్లు కత్తితో పొడిచినట్లు తేలిందని మెహతా తెలిపారు.