కుప్పంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మ‌ర‌ణం

కుప్పం స‌మీపంలో కారు అదుపుత‌ప్పి లారీని ఢీ కొట్టింది. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మ‌ర‌ణం చెందారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2023 9:16 AM IST
కుప్పంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మ‌ర‌ణం

చిత్తూరు జిల్లా కుప్పం స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కారు అదుపు త‌ప్పి ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మెడికోలు దుర్మ‌ర‌ణం చెందారు.

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని గ‌డిప‌ల్లి మండ‌లం సెట్టిప‌ల్లి వ‌ద్ద వేగంగా దూసుకువ‌చ్చిన కారు అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

మృతుల‌ను కుప్పంలో పీఈఎస్ మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న వికాస్, కళ్యాణ్, ప్ర‌వీణ్‌గా గుర్తించారు. ప్ర‌మాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరంతా క‌డ‌ప‌, నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు.

స్నేహితుడి పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుని తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story