Hyderabad: నార్సింగిలో కారు బీభత్సం.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
By అంజి Published on 25 Jan 2024 12:08 PM ISTHyderabad: నార్సింగిలో కారు బీభత్సం.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈరోజు ఉదయం నార్సింగి పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ సమీపంలో కారు రోడ్డు మీద నానా హంగామా సృష్టిస్తూ మితిమీరిన వేగంతో వెళ్లి మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కారు మితిమీరిన వేగంతో ఉండడం వల్ల మోటార్ సైకిల్‌ను ఢీ కొట్టి కొంత దూరం వరకు మోటర్ సైకిల్ ను ఈడ్చుకుంటూ వెళ్లింది.
దీంతో మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి కారు టైర్ల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారును వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేసి.. కారు డ్రైవర్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో కారులో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ పోలీసులు డ్రైవర్ ని మాత్రం అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.