నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం గూబగుండం వద్ద జాతీయ రహదారిపై వెలుతున్న స్కార్పియో అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా.. మృతులను కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మీ, సామ్రాజ్యమ్మగా గుర్తించారు. వీరు బేతంచెర్ల మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరో ఘటనలో ఎన్జీఆర్ జిల్లా కంచికర్ల జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ఢివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టింది.