కృష్ణా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని గొల్లపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణీస్తున్న ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడ, నూజివీడు ఆస్పత్రులకు తరలించారు. బాధితులను నూజీవీడు లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు.
మృతులు ఒడిశా రమేశ్, భూక్యా నాగరాజు, బాణావతు సోనా, బాణావతు నాగు, భూక్యా సోమ్లా, బర్మావత్ బేబీ ఈ ప్రమాదంలో చనిపోయినట్టు అధికారులు తెలిపారు. వీరంతా వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయానికి ఆటోలో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి..
కాగా.. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.