కారును ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది., ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో జరిగింది.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన విశ్రాంత విద్యుత్ ఉద్యోగి శ్రీరాములు, అనంతలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్(36) అతడి భార్య ప్రతీక్ష(35) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమారై గమ్య, ఏడాది వయస్సు ఉన్న బాబు ఉన్నారు. వీకెండ్ కావడంతో కుమారుడిని వారి పేరెంట్స్ దగ్గర ఉంచి కూతురితో కలిసి శుక్రవారం రాత్రి కారులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు.
బెంగళూరు నుంచి ధర్మస్థలం ముంజునాథస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం శనివారం కారులో శృంగేరికీ బయలుదేరారు. ఉడుపి జిల్లా కార్మళ తాలూకా నెల్లికారు గ్రామ పంచాయతీ పరిధిలోని మైనేరు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణీస్తున్న శ్రీకాంత్ , ప్రతీక్షతో పాటు వారి కూతురు గమ్య ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసి అనంతపురంలో ఉన్న శ్రీకాంత్ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.