మాయమైపోతున్నాడమ్మా మనిషిన్న వాడు.. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అన్నాడో సినీ కవి. నిజమే మనిషనే వాడు మాయమైపోతున్నాడు. తోటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయాలన్న ఇంగితం కూడా లేకుండా పోతోంది సమాజంలోని కొంతమంది మనుషుల్లో. మనం మనుషుల మధ్య బతుకుతున్నామా లేక అడవుల్లో ఉంటున్నామా అనే అనుమానం కలిగేలా చేస్తున్నాయి కొన్ని ఘటనలు. కర్ణాటకలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి సాయం చేయాల్సింది పోయి.. ఫోన్లలో వీడియోలు తీసేందుకే ఆసక్తి చూపారు. ఫలితంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్ జిల్లా బైగావత్ వద్ద సిద్దార్ధ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాలు విరిగి రోడ్డుపై అచేతనంగా పడి ఉన్నాడు. ఆ రోడ్డు పై చాలా మంది ప్రయాణిస్తున్నా.. అతడిని ఆస్పత్రిలో చేర్పించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రమాదం జరిగిన గంట సేపు వరకు నెత్తురోడుతున్న గాయాలతో అతడు రోడ్డుపైనే ఉన్నాడు. చాలా మంది అక్కడ గుమిగూడినా.. ఎవరూ అతడిని కాపాడే యత్నం చేయకపోగా.. తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకే మొగ్గు చూపారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న సిద్దార్థ్ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సిద్దార్థ్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ప్రమాదం జరిగి చాలా సేపు కావడం.. తీవ్ర రక్తస్రావంతో సిద్దార్థ్ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ యువకుడి మరణంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.