పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి.. అన్యోన్య దాంప‌త్యం.. విధికి క‌న్నుకుట్టింది

Road accident in hyderabad.హైదరాబాద్ లో జరిగిన రోడ్ ఆక్సిడెంట్ లో భర్త అక్కడికక్కడే మరణించగా భార్య ఆస్పత్రిలో మరణించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2021 4:05 AM GMT
couple dead in road accident

నాలుగేళ్ల క్రితం పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్న‌ప్ప‌టికి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. బాబును చూసుకో అని మ‌ర‌ద‌లి కి చెప్పి ఓ ప‌ని నిమిత్తం భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ బైక్‌పై బ‌య‌ట‌కు వెళ్లారు. ప‌ని ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా.. ఓ టిప్ప‌ర్ మృత్యువు రూపంలో వారిని క‌బ‌ళించింది. భర్త అక్కడికక్కడే మృతి చెంద‌గా.. భార్య మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మైలాన్ పరిశ్రమలో కరీంనగర్ జిల్లా రామగుండం మండలం దద్దోజిపేటకు శ్రీధర్(34) పనిచేస్తున్నాడు. అత‌డికి జ‌గిత్యాల జిల్లా కోరుట్ల‌కు చెందిన దీపిక‌(24)తో నాలుగేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి మూడేళ్ల హనీష్ అనే బాబు ఉన్నాడు. దీపిక.. టెక్ మ‌హీంద్ర‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ప‌టాన్‌చెరులోని శాంతిన‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్నారు. ఇద్ద‌రూ మంచి ఉద్యోగాలు చేస్తుండ‌డంతో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. దీపిక చెల్ల‌లు మాన‌స కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వీరి వ‌ద్దే ఉంటోంది.

కాగా.. శ‌నివారం మ‌ధ్యాహ్నాం ఏదో ప‌ని నిమిత్తం ఆ దంప‌తులు బ‌య‌ట‌కు వెళ్లారు. ఓ గంట‌లో తిరిగి వ‌స్తామ‌ని చెప్పారు. ప‌ని ముగించుకుని వ‌స్తున్న స‌మ‌యంలో ఆల్విన్ కాల‌నీకి వెళ్లే ర‌హ‌దారి కూడ‌లి వ‌ద్ద 65వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై అతివేగంగా వ‌చ్చిన టిప్ప‌ర్ వీరిని ఢీ కొట్టింది. దీంతో శ్రీధర్ అక్కడికక్కడే మరణించాడు. దీపికను పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. త‌ల్లిదండ్రుల మ‌ర‌ణించ‌డంతో మూడేళ్ల హ‌నీష్ అనాథ‌గా మిగిలాడు. దంప‌తుల మృతి ఇరు కుటుంబాల్లో విషాద చాయ‌లు అలుముకున్నాయి.
Next Story
Share it