రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు టీడీపీ నేత‌ల మృతి

Road Accident in Bapatla District.చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు దుర్మరణం చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2022 9:45 AM IST
రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు టీడీపీ నేత‌ల మృతి

బాపట్ల జిల్లా పంగులూరు మండలం కొండముంజులూరు అడ్డరోడ్డు వద్ద మంగ‌ళ‌వారం లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు దుర్మరణం చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల మేర‌కు.. తెలుగు యువత చంద్రగిరి మండల అధ్యక్షుడు కొండాది భానుప్రకాష్‌రెడ్డి (31), టీడీపీ చిత్తూరు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి గంగుపల్లి భాస్కర్‌ (45), ఐటీడీపీ నాయకుడు సోమశేఖర్‌రెడ్డి లు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరులో ఓ వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకు చంద్రగిరి నుంచి కారులో బయల్దేరారు. కొండ‌మంజులూరు అడ్డ‌రోడ్డు వ‌ద్ద వీరు ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పి ముందు వెలుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో భానుప్ర‌కాష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన భాస్కర్‌, సోమశేఖర్‌రెడ్డిల‌ను ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ భాస్క‌ర్ మృతి చెందాడు.

చంద్ర‌బాబు దిగ్భ్రాంతి

తెలుగుదేశం పార్టీ నేత‌లు భానుప్రకాశ్‌రెడ్డి, గంగపల్లి భాస్కర్‌ మృతిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి, త‌దిత‌రులు సంతాపం తెలియ‌జేశారు.


Next Story