బాపట్ల జిల్లాలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు.
టీఎస్ 07 జీడీ 3249 నంబరు గల కారు చినగంజాం నుంచి అద్దంకి వెలుతోంది. కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలోకి రాగానే కారు టైరు పంక్ఛర్ అయ్యింది. దీంతో కారు అదుపు అప్పి డివైడర్‌ను దాటుకుని అవతలి వైపుకు ఎగిరి పడిపోయింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెలుతున్న లారీ కారును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో అద్దంకి పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న సుందర్ వలీ కుటుంబ సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. సుందర్ వలీ భార్య, కూతురు, మరదలు, మరో మహిళ, కారు డ్రైవర్ మరణించిన వారిలో ఉన్నారు.
వీరంతా చినగంజాంలో జరుగుతున్న శివరాత్రి తిరునాళ్ల మహోత్సవాలను చూసేందుకు వచ్చారు. చినగంజాంలో ఉత్సవాలు చూసిన అనంతరం వారు అర్ధరాత్రి కారులో అద్దంకిలో ఉంటున్న ఎస్ఐ సుందర్ వలీ నివాసానికి బయల్దేరారు. మార్గమధ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.