యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీ కొని నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఆలేరు మండలం మంతపరి వద్ద బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ట్రాక్టర్ ఉంచి పక్కగా కూలీలు పనులు చేస్తున్నారు. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. వరంగల్ నుంచి హైదరాబాద్ వెలుతోంది. మంతపురి వద్దకు వచ్చే సరికి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో పాటు అక్కడే పని చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
పలువురు గాయపడగా.. వారిని సమీపంలోని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ క్షతగాత్రుల్లో ఒకరు మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో జనగామ-హైదరాబాద్ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంబించింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను భువనగిరి మండలం రాయిగిరి చెందిన అంకర్ల లక్ష్మీ, అంకర్ల కవిత, కూలీలను తీసుకువచ్చిన డ్రైవర్ ఊరేళ్ల శ్యామ్‌గా గుర్తించారు.